సింగర్ శ్రావణ భార్గవి తన యూట్యూబ్ ఛానల్ నుంచి ‘ఒకపరి కొకపరి వయ్యారమై’ వీడియోను తొలగించారు. అన్నమాచార్యుల పెదకుమారుడు పెద తిరుమలాచార్యులు రాసిన ‘ఒకపరి కొకపరి ఒయ్యారమై’ )కీర్తనతో గాయని శ్రావణ భార్గవి చిత్రీకరించిన ఫ్యూజన్ వీడియో వివాదాలకు దారి తీసిన సంగతి తెలిసిందే! అన్నమాచార్యుల వంశస్థులు ఆ పాట చిత్రీకరణపై అభ్యంతరం వ్యక్తం చేసి, యూట్యూబ్ నుంచి తొలగించమని కోరగా ఆమె తిరస్కరించారు.
అందులో ఎలాంటి తప్పు లేదని, అభ్యంతరకరంగా ఉంటే దైవానుగ్రహం దక్కేది కాదని, అందుకే ఆ వీడియోను తొలగించేది లేదని, పైగా చేతనైంది చేసుకోమని ఆమె అన్నమయ్య వంశస్థులతో అహంకారంగా మాట్లాడారు. దీనితో తిరుపతి వాసులు గళం విప్పారు. శ్రావణ భార్గవిపై తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పలువురు తిరుపతిలో నిరసనలు వ్యక్తం చేశారు.
ఇన్ని జరిగినా ఏ మాత్రం తగ్గలేదు శ్రావణ భార్గవి. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా అభిమానులు విరుచుకు పడ్డారు. ఇక లాభం లేదనుకుని సింగర్ శ్రావణ భార్గవి ఓ మెట్టు దిగి ఆ వీడియోను యూట్యూబ్ నుంచి తొలగించారు. దైవాజ్ఞ ఉంటే అది తప్పకుండా ఉంటుందన్న ఆమె ఇప్పుడు ఆ వీడియో తొలగించడం పట్ల తిరుపతి వాసులు, అన్నమయ్య వంశస్థులు, శ్రీవారి భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు